Wed22052013

Last updateWed, 22 May 2013 11am

Back You are here: Home న్యూస్ బిట్స్ న్యూస్ రాష్ట్రీయం ఆటో డ్రైవర్ కూతురు సీఏ టాపర్

ఆటో డ్రైవర్ కూతురు సీఏ టాపర్

ప్రతిభకు పేదరికం అడ్డుకాదని మరోసారి రుజువైంది. ముంబైకి చెందిన ఆటోడ్రైవర్ జయకుమార్ కుమార్తె ప్రేమ (24) తొలి ప్రయత్నంలోనే చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) పరీక్షలో అఖిల భారత స్థాయిలో టాపర్‌గా నిలిచి తన కలను సాకారం చేసుకున్నారు. ‘నాకోసం మా నాన్న ఎంతో శ్రమపడ్డారు. నన్ను నిరంతరం ప్రోత్సహించేవారు. ఈ పరీక్షలో విజయం సాధించి ఆయనకు విశ్రాంతినివ్వాలని ముందే నిర్ణయించుకున్నాను. నా తల్లిదండ్రులకు సౌకర్యవంతమైన జీవితాన్ని అందించడమే నా లక్ష్యం’ అని ఆమె స్పష్టంచేశారు. తనకు కూడా వయసైపోయిందని, ఇప్పుడిక విశ్రాంతి తీసుకుంటే బావుంటుందనుకుంటున్నానని జయకుమార్ తన కుమార్తెవైపు మురిపెంగా చూస్తూ చెప్పారు. ప్రేమ స్థానిక నగీన్‌దాస్ ఖండ్‌వాలా కళాశాలనుంచి గ్రాడ్యుయేషన్, ముంబై విశ్వవిద్యాలయంనుంచి ఎంకాం పూర్తిచేశారు. తన విజయానికి సహకరించిన కళాశాల అధ్యాపకులకు, కోచింగ్ సెంటర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రేమ తమ్ముడు ధనరాజ్ (22) కూడా తొలి ప్రయత్నంలోనే సీఏ పరీక్షలో ఉత్తీర్ణుడు కావడం విశేషం.
ఫీజులెప్పుడూ సమస్య కాలేదు: నలుగురు సభ్యులున్న ప్రేమ కుటుంబం స్థానిక మలాడ్‌లోని ఎస్‌బీ ఖాన్ చాల్‌లోని 300 చదరపు అడుగుల అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆ ఇరుకు నివాసంనుంచే వారు అద్భుత విజయం సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. సోమవారం ప్రకటించిన సీఏ ఫలితాల్లో 800 మార్కులకు గాను 607 మార్కులు సాధించారు. ఇలాంటి విజయాలు ఆమెకు కొత్తకాదు. పాఠశాల దశనుంచి ఆమె టాపర్‌గా నిలుస్తున్నారు. బీకాం మూడో సంవత్సరంలో 90 శాతం సాధించి ముంబై విశ్వవిద్యాలయంలో రెండో స్థానంలో నిలిచారు.

‘‘నా తండ్రి జయకుమార్ పెరుమాళ్ తమిళనాడుకు చెందినవారు. ఇక్కడ 20 ఏళ్లుగా ఆటో నడుపుతున్నారు. ఆయన ఆదాయం స్థిరంగా ఉండదు. నెలకు సుమారు రూ.15 వేలు సంపాదించేవారు. మా అమ్మ లింగమ్మాళ్ ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసేవారు. నేను ఆర్టికల్‌షిప్‌చేస్తూ సంపాదించడం మొదలుపెట్టాక ఆమె ఆ పని వదిలేసింది. ఇద్దరూ స్కూల్ చదువుకంటే ఎక్కువ చదవలేదు. మేమిద్దరం ఈ విజయాన్ని సాధించడం చూసి వారు గర్విస్తున్నారు’’ అని చెప్పారు. ఫీజు చెల్లించడం తన తల్లిదండ్రులకెప్పుడూ సమస్య కాలేదన్నారు. స్కూల్‌లో స్కాలర్‌షిప్ వచ్చేదని, కోచింగ్ సెంటర్‌నుంచి రూ.40 వేలు స్కాలర్‌షిప్ కూడా అందుకున్నానని తెలిపారు.

తమ్ముడికి స్ఫూర్తి: తనతోపాటు తన తమ్ముడు కూడా సీఏ ఉత్తీర్ణుడు కావడంపట్ల ఆమె ఆనందం వ్యక్తంచేశారు. ‘‘నా తమ్ముడు హెచ్‌ఎస్‌సీ పూర్తయినప్పటినుంచీ సీఏకు తయారవుతున్నాడు. 2010లో బీకాం పూర్తిచేశాడు. ఇద్దరం కలిసి 2012 నవంబర్‌లో సీఏకు దరఖాస్తు చేశాం. డిగ్రీ చేసేటప్పుడు కాల్‌సెంటర్‌లో పనిచేసి అతను తన రిజిస్ట్రేషన్ ఫీజుకు డబ్బు సంపాదించుకున్నాడు’’ అని ఆమె చెప్పారు. ఆర్టికల్‌షిప్ సమయంలో తాను నెలకో రూ.5 వేలు సంపాదించేదాన్నని తెలిపారు. తన అక్క చాలా తెలివైనదని, ఆమే తనకు స్ఫూర్తి అని ధనరాజ్ చెప్పారు. ఇద్దరం కలిసి చదువుకునేవాళ్లమని, ఆమె సహాయంతోనే తాను సీఏ పూర్తిచేయగలిగానని తెలిపారు. తాము చదువుకునే సమయంలో ఇరుగుపొరుగువారు కూడా చక్కగా సహకరించారని చెప్పారు.
విజయపథం: ప్రేమ 2008లో బీకాం పూర్తిచేశాక ఐసీఏఐ నిర్వహించిన సీపీటీ (కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్) రాశారు. 2009 నవంబర్‌లో ఐపీసీఈ (ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కంపీటెన్సీ ఎగ్జామినేషన్)లో రెండు గ్రూపుల్లోనూ ఉత్తీర్ణులయ్యారు. దీంతో రెండున్నరేళ్ల ఆర్టికల్‌షిప్‌కు అర్హత సాధించి, ఆ తర్వాత సీఏ ఫైనల్‌కు అర్హత సాధించి తొలి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలిచారు. ‘‘సీఏ పరీక్షలో చాలామంది చాలాసార్లు విఫలం కావడం చూశాను. మేమిద్దరం ఉదయం 7:30 గంటలనుంచి అర్ధరాత్రి 12 గంటలవరకు చదువుకునేవాళ్లం. మధ్యాహ్నం లంచ్‌కోసం ఒక బ్రేక్ తీసుకునేవాళ్లం. రాత్రి పడుకునేముందు ఓ అరగంట టీవీ చూసేవాళ్లమంతే. అయితే రోజంతా చదివేటప్పుడు సరిపడినంత నిద్ర కూడా అవసరం. సరైన విశ్రాంతి లేకపోతే మనం పడ్డ శ్రమంతా వృథా అవుతుంది’’ అని ప్రేమ తన విజయ రహస్యాన్ని వివరించారు.

AddThis Social Bookmark Button

Law Point

JA Teline IV
Friday @ 9PM

Praja Prasthanam

JA Teline IV
@ 9.30AM

The Prime Time Show

JA Teline IV
Mon to Thu @ 9PM

Ding Dong

JA Teline IV
wed & Sat @ 8.30PM

Bhavita

JA Teline IV
Sunday @ 9.30AM