మరో 9మంది ఎమ్మెల్యేల గుడ్‌బై!
- Details
- Published on Sunday, 27 January 2013 14:03
కర్ణాటకలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే బీజేపీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు తమ రాజీనామా పత్రాలను గవర్నర్ భరద్వాజ్‌కు ఇదివరకే అందజేసిన విషయం తెలిసిందే. అదే దారిలో నడవడానికి మరో తొమ్మిది మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే శెట్టర్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయి అధికారం కోల్పోవాల్సి వస్తుంది. తాజాగా రాజీనామాకు సిద్ధపడ్డవారిలో రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మురుగేష్ నిరాణి, అబ్కారీ శాఖ మంత్రి రేణుకాచార్య, పశు సంవర్థక శాఖ మంత్రి రేవూనాయక్ బెళమగితోపాటు ఎమ్మెల్యేలు ఎస్.వి రవిచంద్ర, శ్రీశైలప్ప బిదరూరు, మాడల్ విరూపాక్షప్ప, రామణ్ణ లమాణి, సీసీ పాటిల్, సునీల్ వల్యాపుర ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, ఎమ్మెల్యే పదవికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సునీల్ వల్యాపుర ఇప్పటికే ప్రకటించారు. రాజీనామా చేసిన 13 మంది ఎమ్మెల్యేలతో కలిసి వీరంతా సోమవారం స్పీకర్ బోపయ్యకు తమ రాజీనామా లేఖలను అందజేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఇప్పటివరకూ ఎలాగైనా సరే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి తీరాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ ప్రభుత్వం హఠాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం.
మెజార్టీ ఉంది: గవర్నర్
శెట్టర్ సర్కారు మెజార్టీలో ఉందని, మైనార్టీలో పడితే బలపరీక్షకు ఆదేశిస్తానంటూ కర్ణాటక గవర్నర్ హెచ్‌ఆర్ భరద్వాజ్ స్పష్టంచేశారు. ఎమ్మెల్యేలు రాజీనామాలు ప్రకటించినప్పటికీ, సర్కారు ఇంకా మెజార్టీలోనే ఉందని గవర్నర్ తెలిపారు. ఒక్క ఎమ్మెల్యే తక్కువ అయినా, తాను బలపరీక్షకు ఆదేశిస్తానన్నారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో తాను రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించబోనని కర్ణాటక అసెంబ్లీ స్పీకరు కె.జి. బోపయ్య వెల్లడించారు. తాను రాజ్యాంగానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోనని, అలాగే ఇతరుల సలహాల ప్రకారం కూడా నడుచుకోనని పునరుద్ఘాటించారు.











