Sun19052013

Last updateSun, 19 May 2013 9pm

Back You are here: Home న్యూస్ బిట్స్ న్యూస్ జాతీయం రెండో రోజూ మథనం

రెండో రోజూ మథనం

తెలంగాణ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ అధిష్టానం వరుసగా గురు వారం రెండో రోజు కూడా తీవ్రస్థాయిలో మంతనాలు కొనసాగించింది. ముందు నుయ్యి, వెనక గొయ్యిగా మారిన పెను సమస్య నుంచి తాత్కాలికంగానైనా బయటపడే మార్గాంతరాల కోసం ముఖ్య నేతలంతా మల్లగుల్లాలు పడ్డారు. ఏ నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడపైనే ప్రభావం చూపేలా కన్పిస్తుండటం పట్ల అధిష్టానం తీవ్ర ఆందోళనతో ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే కొంతకాలంగా ఢిల్లీలోనే మకాం వేసి రకరకాల ఒత్తిళ్లతో తమను ఉక్కిరిబిక్కిరి చేస్తూ వచ్చిన తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను వెనక్కు పంపడం ద్వారా పార్టీ పెద్దలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. శాంతి, సహనం వహించాల్సిందిగా ఇరు ప్రాంత నేతలు, శ్రేణులకు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణతో అధిష్టానం విజ్ఞప్తి కూడా చేయించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తన నివాసం 10, జన్‌పథ్‌లో సుశీల్‌కుమార్ షిండే, పి.చిదంబరం, గులాంనబీ ఆజాద్, వయలార్ రవి, దిగ్విజయ్‌సింగ్, ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్ తదితర ముఖ్యులతో గురువారం కూడా భేటీ అయ్యారు. సాయంత్రం 3.45 నుంచి 4.20 దాకా లోతుగా చర్చోపచర్చలు జరిపారు. కానీ భేటీ తర్వాత వారంతా మీడియాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిష్ర్కమించారు. గతంలో తనతో భేటీ అయినప్పుడల్లా ఒక్కో ముఖ్య నేత ఒక్కోలా చేసిన వ్యాఖ్యలు లేనిపోని ఇబ్బందులకు దారి తీశాయన్న భావనతోనే సోనియానే వారిని ఈ మేరకు ఆదేశించినట్టు చెబుతున్నారు. నిర్ణయం తీసుకోవడంలో మరింత ఆలస్యం అనివార్యమేనని ఏఐసీసీ వర్గాలంటున్నాయి. నెలలోపు తేల్చేస్తామన్న ప్రకటనపై ఇలా వెనక్కు తగ్గేందుకు నిఘా వర్గాల సమాచారం కూడా కారణమని తెలుస్తోంది.

ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కిరణ్ సర్కారు మనుగడపైనే తీవ్రంగా ప్రభావం చూపడం ఖాయమని అవి స్పష్టం చేయడం అధిష్టానాన్ని కలవరపరుస్తున్నట్టు ఆ వర్గాలు వివరించాయి. ‘‘ఇప్పుడు కావాల్సింది సహనం. శాంతియుత పరిష్కారం కోసం పార్టీ సమష్టిగా పని చేయాల్సి ఉంది. ఒక ముందడుగు దిశగా కాంగ్రెస్ పెద్దలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అది రెండు ప్రాంతాలకూ మేలు చేసేలా, వాటి దీర్ఘకాలిక ప్రయోజనాలకు దోహదపడేలా మాత్రమేగాక జాతీయ ప్రయోజనాలను కూడా బలోపేతం చేసేలా ఉంటుంది’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేశాయి. అందుకే.. ‘సదరు ముందడుగు ప్రకటనకు త్వరలో ఒక రూపం రావచ్చు. ఆలోగా ఓపిక పట్టండి’ అన్నదే ప్రస్తుతానికి పార్టీ నేతలందరికీ అధిష్టానం ఇస్తున్న సందేశమని ఏఐసీసీ వర్గాలు వివరించాయి. ముఖ్య నేతలు వెళ్లిపోయాక పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా వచ్చి తల్లితో చర్చలు కొనసాగించారు. తెలంగాణ అంశంపై చర్చల్లో ఆయన పాలుపంచుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం! ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 5 గంటలకు సీమాంధ్ర నేతలకు ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ను రాహుల్ రద్దు చేసుకున్నారు! తాను ఏదో ఒక ప్రాంతం నేతల వైపు మొగ్గుతున్నానన్న భావనకు తావీయొద్దన్న ఉద్దేశం కూడా దీని వెనక ఉన్నట్టు తెలుస్తోంది. అత్యంత వివాదాస్పదమైన తెలంగాణ అంశంపై పూర్తిస్థాయిలో తటస్థంగా ఉండేందుకే ఆయన మొగ్గుతున్నట్టు సమాచారం.

జానా శాంతి మంత్రం!

మరోవైపు తమ వాదనలతో అధిష్టానాన్ని ఒప్పించేందుకు కొంతకాలంగా ఢిల్లీలో అన్నిరకాల ప్రయత్నాలూ చేసిన ఇరు ప్రాంతాల కాంగ్రెస్ నేతలూ తిరుగుముఖం పట్టారు. సకాలంలో ప్రయాణ టికెట్లు దొరకని వారు మినహా అంతా తిరిగి వచ్చేస్తున్నారు. ‘ఏం చేయాలో అన్ని కోణాల నుంచీ ఆలోచించి మేం చేస్తాం. ఈలోగా రాష్ట్రానికి తిరిగి వెళ్లండి’ అంటూ స్పష్టమైన సంకేతాలు అందడమే ఇందుకు కారణమంటున్నారు. ఇక ‘నెల రోజుల్లో పరిష్కారం లభించదు’ అంటూ బుధవారం ఆజాద్ రాజేసిన అగ్గిని కూడా చల్లార్చేందుకు అధిష్టానం ప్రయత్నిస్తోంది. ఆ వ్యాఖ్యలను సమర్థించేందుకు తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి కె.జానారెడ్డిని రంగంలోకి దించాల్సిందిగా బొత్సను పురమాయించింది. దాంతో మరో మంత్రి పొన్నాల లక్ష్మయ్యతో కలిసి జానా మీడియాతో మాట్లాడారు. ఆందోళనలకు దిగకుండా సంయమనం పాటించాల్సిందిగా రెండు ప్రాంతాల వారికీ విజ్ఞప్తి చేశారు. సంప్రదింపులు జరుగుతున్నాయని, అవి ఇంకా కొనసాగుతాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి మీడియాకు తెలిపారు. నెల రోజుల డెడ్‌లైన్ సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ ఏమైనా నిర్ణయం తీసుకుందా అన్న ప్రశ్నకు ఆమె ఈ విధంగా బదులిచ్చారు. దీనిపై ఏఐసీసీ ముఖ్య నేత ఒకరిని కదిలించగా, ‘ప్రస్తుతానికి ఏ నిర్ణయమూ తీసుకోలేదు’ అనడం మినహా ఇంకేమీ చెప్పేందుకు ఆయన ఇష్టపడలేదు!

 

AddThis Social Bookmark Button

Law Point

JA Teline IV
Friday @ 9PM

Praja Prasthanam

JA Teline IV
@ 9.30AM

The Prime Time Show

JA Teline IV
Mon to Thu @ 9PM

Ding Dong

JA Teline IV
wed & Sat @ 8.30PM

Bhavita

JA Teline IV
Sunday @ 9.30AM