2014లో యూపీఏ కుదేలే!
- Details
- Published on Friday, 25 January 2013 08:55
సాధారణ ఎన్నికలకు ఏడాది మాత్రమే ఉన్న నేపథ్యంలో యూపీఏ-2 ప్రభుత్వానికి మరో దుర్వార్త. కాంగ్రెస్ సారథ్యంలోని పాలక సంకీర్ణానికి ప్రజాదరణ శరవేగంగా అడుగంటుతోందని ఇండియాటుడే-నీల్సన్ సర్వే వెల్లడించింది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం దేవుడెరుగు, వారి అంచనాలను అందుకోవడంలో కూడా యూపీఏ-2 దారుణంగా విఫలమైందని తేల్చింది. అవినీతి, ద్రవ్యోల్బణాలను ఏమాత్రం అదుపు చేయలేక చేతులెత్తేసిందని, ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో పూర్తిగా చతికిలపడిందని పేర్కొంది. యూపీఏ పాలన తీరుతెన్నులపై ప్రజల్లో ఆగ్రహం, అసంతృప్తి నెలకొన్నాయని వివరించింది.
తత్ఫలితంగా 2014 సాధారణ ఎన్నికల్లో యూపీఏకు ఓట్ల శాతం 7.7 శాతం తగ్గుతుందని, ఫలితంగా అధికార కూటమి ఏకంగా 102 లోక్‌సభ స్థానాలను కోల్పోయి ప్రస్తుతమున్న 259 సీట్ల నుంచి కేవలం 157కు పరిమితమవుతుందని జోస్యం చెప్పింది! అదే సమయంలో బీజేపీ నేతృత్వంలోని విపక్ష ఎన్డీఏ కూటమి బలం ప్రస్తుతమున్న 159 లోక్‌సభ స్థానాల నుంచి 203కు పెరుగుతుందని అభిప్రాయపడింది. ఇక 2009 ఎన్నికల్లో 125 స్థానాలు సాధించిన ‘ఇతరులు’ ఈసారి ఏకంగా 183 లోక్‌సభ సీట్లతో భారీగా బలపడి నిర్ణాయక శక్తిగా మారనున్నట్టు అంచనా వేసింది. ‘జాతి మనోగతం (మూడ్ ఆఫ్ ద నేషన్) పేరిట నిర్వహించిన సర్వే ఫలితాలను ఇండియాటుడే-నీల్సన్ గురువారం ఈ మేరకు వెల్లడించింది. దేశమంతటా ఆసక్తి రేపుతున్న ‘మోడీ వర్సెస్ రాహుల్’లో గుజరాత్ ముఖ్యమంత్రికే స్పష్టమైన మొగ్గు కన్పించడం విశేషం. ఇక మహిళలపై అత్యాచారానికి పాల్పడేవారికి మరణశిక్ష విధించాలని ఏకంగా 87 శాతం ఆకాంక్షించారు! 10 శాతమే దాన్ని వ్యతిరేకించారు.
2014 సాధారణ ఎన్నికల్లో యూపీఏకు 28 శాతం ఓట్లు మాత్రమే లభిస్తాయని సర్వే తేల్చింది. 2009తో పోలిస్తే ఇది ఏకంగా 7.7 శాతం తక్కువ! యూపీఏ కోల్పోతున్న ఈ ఓట్ల నుంచి ఎన్డీఏ మాత్రం పెద్దగా లాభపడటం లేదు. 1.6 శాతం ఓట్ల పెరుగుదలతో 2014లో అదనంగా 44 సీట్లను గెలుచుకోనుంది. అలాగే 7.7 శాతం తగ్గిన ఓట్ల ఫలితంగా యూపీఏ 102 సీట్లను కోల్పోనుందని ఇండియాటుడే-నీల్సన్ పేర్కొంది.
మోడీయం!
గుజరాత్ సీఎం నరేంద్రమోడీకి ప్రజాదరణ గత ఆర్నెల్లలో బాగా పెరిగిందని సర్వే వివరించింది. తాజాగా కాంగ్రెస్ ఉపాధ్యక్ష పీఠమెక్కిన రాహుల్ పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థిగా తన స్థానాన్ని బలోపేతం చేసుకున్నారని పేర్కొంది. అయితే వారిద్దరిలో ఎవరిని ప్రధానిగా చూడాలని భావిస్తున్నారన్న ప్రశ్నకు 57 శాతం మంది మోడీ పేరే చెప్పారు. 41 శాతం మంది మాత్రమే రాహుల్‌కు ఓటేశారు. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా రాహులే బరిలో దిగుతారని 52 శాతం, కాదని 36 శాతం అభిప్రాయపడ్డారు. మోడీయే బీజేపీ అభ్యర్థి అని 54 శాతం మంది భావిస్తుండగా, 26 శాతం మాత్రమే కాదని అంచనా వేశారు.
గత ఆరు నెలల్లో కీలకమైన అన్ని అంశాల్లోనూ ప్రజల అంచనాలను అందుకోవడంలో మన్మోహన్‌సింగ్ సర్కారు ఘోరంగా విఫలమైందన్న భావన సర్వేలో స్పష్టంగా వ్యక్తమైంది. పోలీసులను అవినీతిపరులుగా భావిస్తున్న వారి (24 శాతం) కంటే రాజకీయ నాయకులే అక్రమార్కులని అంటున్న వారి సంఖ్యే (58 శాతం) ఎక్కువగా ఉండటం యూపీఏ-2 పాలనపై ప్రజల వ్యతిరేకతకు అద్దం పట్టింది. ప్రధానిగా మన్మోహన్ పనితీరు బాగుందన్న వారు 26 శాతమే కాగా, అంతంతమాత్రమని 39 శాతం, బాలేదని 27 శాతం మంది పేర్కొన్నారు. ఇక యూపీఏ ఆర్థిక సంస్కరణలపై ఏకంగా 49 శాతం మంది పెదవి విరిచారు. 37 శాతం మాత్రమే వాటిపట్ల సంతృప్తిని వెలిబుచ్చారు. చిల్లర వర్తకంలో మల్టిబ్రాండ్ ఎఫ్‌డీఐ వాటాను పెంచుతూ యూపీఏ తీసుకున్న నిర్ణయాన్ని 40 శాతం మంది వ్యతిరేకించారు.
డిసెంబర్ 16న ఢిల్లీలో జరిగిన దారుణమైన సామూహిక అత్యాచారం పట్ల హస్తిన వీధుల్లో పెల్లుబికిన ఆందోళనలను అణచివేయడంలో కేంద్రం అత్యంత కఠినంగా వ్యవహరించిందని 30 శాతం మంది విమర్శించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ప్రణాళిక లోపించిందని మరో 40 శాతం అభిప్రాయపడ్డారు. ఈ దారుణోదంతం నేపథ్యంలో మహిళలు ఇంటా బయటా సురక్షితంగా ఉండేందుకు తక్షణం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాల్సి ఉందని ప్రజలు భావిస్తున్నట్టు సర్వే తేల్చింది. రాత్రుళ్లు మహిళలు గడప దాటడం ఏమాత్రమూ సురక్షితం కాదన్న భావన దేశవ్యాప్తంగా నాటుకుపోయిందని వెల్లడించింది. ఇటు స్త్రీలలోనూ, అటు పురుషుల్లోనూ 52 శాతం మంది చొప్పున ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు.











