యుగాంతం ప్రచారంతో బుగరాక్‌కు తాకిడి
- Details
- Published on Thursday, 20 December 2012 17:06
యుగాంతం సంభవిస్తే.. బతికి బట్టకట్టే మార్గం లేదా?.. మానవాళి అంతరించి పోవాల్సిందేనా?.. అంతా వినాశనమేనా?..అలాంటి భయం అక్కర్లేదంటున్నారు బుగరాక్ వాసులు. తమ ప్రాంతానికి వస్తే ఎంచక్కా జీవించవచ్చని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మరి బతుకు భరోసా ఇస్తున్న బుగరాక్‌కు వెళ్లొద్దామా..
బుగరాక్.. ఫ్రాన్స్‌లోని ఓ పర్వతం పేరు. జనాభా 200 పైచిలుకు. అందరి వృత్తి వ్యవసాయమే. చుట్టూ పర్వతాలు..పచ్చదనంతో ప్రశాంతంగా కనిపించే పల్లె.
జన సంచారం అంతంత మాత్రంగా ఉండే బుగరాక్ ఇప్పుడు కిటకిటలాడుతోంది. దేశ, విదేశాల నుంచి యాత్రికులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్ధులు ఇక్కడికి క్యూ కట్టారు. జనం ఇంతగా ఎగబడ్డానికి కారణం ఒకటే.. యుగాంతంలో కూడా బుగరాక్ సురక్షితంగా ఉంటుందని నమ్మడమే.
ఎన్నో వింతలు, విశేషాలకు నిలయం బుగరాక్. ఎగుడు దిగుడుగా ఉంటాయి బుగరాక్ పర్వతాలు. గ్రహాంతర వాసులు ఫ్లయింగ్ సాసర్లలో ఇక్కడికి వస్తారని జనం నమ్మకం. పర్వతం లోపలి భాగాన్ని స్పేస్ వెహికల్ పార్కింగ్‌కు ఉపయోగిస్తారని.. అందుకే ఇక్కడ రాత్రిళ్లు వింత శబ్దాలు వస్తుంటాయని అంటారు. అప్పుడప్పుడు కనిపించే కాంతి పుంజాలే ఇందుకు నిదర్శనమంటారు. పర్వతానికి ఆకర్షణ శక్తి కూడా ఉందని వాదిస్తారు. ఈ వాదనలే బుగరాక్‌కు ఎక్కడలేని ప్రాచుర్యం తెచ్చిపెట్టింది. యుగాంతం నాడు పర్వత శిఖర భాగానికి చేరుకున్న వారిని గ్రహాంతర వాసులు ఫ్లయింగ్ సాసర్లలో వచ్చి రక్షిస్తారని చాలా మంది నమ్మకం.
మయన్ల క్యాలెండర్ ప్రకారం ఈనెల 21న యుగాంతం ప్రచారంతో బుగరాక్‌కు తాకిడి ఎక్కువైంది. నెట్‌లో బుగరాక్ పేరు హల్‌చల్ చేస్తోంది. ఇక్కడి రాళ్లు, రప్పలకు ఎక్కడ లేని గిరాకీ వచ్చేసింది. లక్షలు వెచ్చించి జనం బుగరాక్‌కు పయనమవుతున్నారు. జనం తాకిడి తట్టుకోలేక.. ఇక్కడకు రావద్దంటూ స్థానిక యంత్రాగం బోర్డులు ఏర్పాటు చేసింది. అయినా జనం ఆగడంలేదు. గత్యంతరం లేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయితే స్థానికుల నమ్మకాన్ని శాస్త్రవేత్తలు కొట్టి పారేస్తున్నారు. అగ్నిపర్వతం కావడం వల్ల లోపల మరిగే లావా ధ్వని బయటకు వస్తుంటుందని అంటున్నారు. వాస్తవాల నిగ్గు తేల్చేందుకు వారు కూడా బుగరాక్‌కు పయనమవుతున్నారు.











